Tuesday, October 13, 2015

నాకు నా బాల్యంలోని కొన్ని సంఘటనలు
ఇంకా నాకు గుర్తుకొచ్చి బాధిస్తూనే వుంటాయ్.

అది నడి ఎండాకాలం దాటి కొద్దికొద్దిగా
వానాకాలం వైపు అడుగులు పడుతున్న సందర్భం.

నాకు ఆనందాన్నందించే వానచినుకులు
 నన్ను బాగా తడిపి ముద్దను చేసిన సమయం.
నాకాగితంపడవనాకళ్ళెదుటనే
గుంటలోకి జారిపోయి మునిగిపోయింది.


అకస్మాత్తుగా ఆకాశమంతా చిక్కటి
చీకటితోగూడినట్టుగా మేఘావృతమై
బలంగావీచే గాలులతోడై
భీభత్సం సృష్టించింది.



వరద వెల్లువలా వాననీరు
వడివడిగా ఉరుకులతో పరుగులు  తీసిపారింది.
బురధ నీటితో నిండిన ఏరు
నాకాగితంపడవను క్రూరంగా ముంచేసింది.


ఆ తుఫాను భీభత్సం నన్ను నాతృప్తినీ
చూసి ఓర్వలేక ఈ అఘాయిత్యానికి
తలపడివుంటుందని నా ప్రగాఢ విశ్వాసం.

చిన్నప్పుడు ఆడే ఆటలన్నీ ఈ వేసవిలోనే
 ఆడేయాలన్న తపనకు ఈ వాతావరణానుకూలత
 నన్ను పూర్తిగా భంగపాటుకు గురిచేసి
కిమ్మిన్నాస్తిగా మారి  గమ్మున కూర్చుండిపోయింది.

నేను ఆటలన్నింటిలో విజేతను కాకపోయినా
నా బాల్యాన్ని నేను అనుభవించలేకపోయానన్న
అసంతృప్తి నన్ను నిరాశా నిస్పృహలకు లోను చేసింది.



విధి నాతో ఆడుకున్న వింతనాటకాలలో  ఇది భాగమని
మునిగిపోయిన నా కాగితం పడవనాకు
 పదే పదే గుర్తు చేసి మరీ బాధిస్తుంటుంది.

]టాగూరు తోటమాలిలోని 70 వ కవితకు నా తెలుగుసేత.]

Monday, October 12, 2015

ప్రియా!! రాత్రింబవళ్ళూ నీకోసమే
నాహృదయం తపనపడుతుంది.
మన ఈ కలయిక ఆకలిగొన్న
మృత్యువులా అగుపిస్తున్నది.

ఒక తుఫాను గాలిలా
నా సర్వస్వాన్నీ  ఊడ్చేసేయ్ .
నా దగ్గరున్న అన్నింటినీ
 నిర్భయంగా తస్కరించు.

నిద్రావస్థలోంచి
నన్ను తక్షణం   జా గృతంచెయ్.

ఈ ప్రపంచంలోంచి నన్ను
స్వేచ్ఛగా దొంగిలించేసెయ్.

ఈ విపత్కర స్థితిలో
 సౌం దర్యారాధనలో
మన ఇరువురం మమేకమవుదాం

అయినా నా అత్యాశగానీ
నీలో ఐక్యమవడం తప్ప
నా జీవనగమ్యం
ఇంకొకటి యేముంటుంది?


టాగూరు తోటమాలిలోని 50 వ కవితకు నా తెలుగు సేత]
==========================================

Sunday, October 11, 2015

అపరిమితమైన వేగంతో
 అతిధులంతా
పరుగు పరుగునా  నిష్క్రమించాలి
వెనువెంటనే వారు  వదిలివెళ్ళిన
 పాదముద్రలనన్నింటినీ
ఆనవాలు కూడా కనబడని  విధంగా
వడి వడిగా చెరిపేయాలి.

వారిని  హృదయానికి హత్తుకుని
సర్వ సాధారణమైనమందహాసo
 సామీప్యంలో తదనుగుణంగా
వారి కత్యంత  సన్నిహితంగా
 ప్రదర్శింపబడాలి.

ఇవ్వాళ ప్రేతాత్మల పండుగ
అవెప్పుడు మృత్యుముఖంలోకి
నేరుగా   వెళ్తాయో కూడా  అర్ధమవని
అసందిగ్ధమైన ఆక్రోశం.

నీ నవ్వు  అర్ధం  పర్ధంలేని భ్రమలో పడి
 చిరంతనంగా ,  వికసించనీ!!
తరంగాలపై తళుక్కుమనే కాంతిరేఖల్లా
తాత్కాలికంగానైనా దాన్ని  తారట్లాడనీ!


కాలం అంచులపైన ఆకులపై
ప్రకాశించే మంచుబిందువులా
  నీజీవితం ఆనంద నృత్యమాడనీ!!

నీవు అశాశ్వతమైన
పదాల పోహళింపుతో
క్షణకాలంపాటు
తీగలను సవరించుకో!!

[టాగూరు తోటమాలిలోని 45 వకవితకు తెలుగుసేత.]
======================================================
ఆ తీయని నీ పిలుపుకోసమే ప్రభూ!
నేను ఏకాక్షరంతో స్మరణ చేసేది.

నీ జవాబు కోసమే ప్రభూ!!
నేను ద్విత్వాక్షరాలతో
ప్రార్ధనలు గావించేది.

ఆ కరుణామృత వర్షంకోసమే
త్రిగుణాత్మకంగా విన్నవించేది.

ఆ సాక్షాత్కారంకోసమే ప్రభూ
చతురంబోధులతో నిన్నభిషిక్తుడిగా
పూజించి ప్రాధేయపడేది.

నిన్ను ప్రసన్నుడిని
చేసుకునేందుకే ప్రభూ
నీకు పవిత్రమైన
పంచామృతస్నానం చేయించి
మరీ పూజలో స్థాపించి
స్థిరపరిచేలాగా చూసేది.
---------------



=================================

Saturday, October 10, 2015

త్వదీయం
------------


నీ కరస్పర్శ తగలగానే
నరనరాల్లోనూ
ఉత్కంఠావహమైన ఉత్తేజం.


నువ్వు నన్ను గుండెకు
హత్తుకున్నంతనే ప్రత్యణువులోనూ
వాసంత సమీరం
ఉవ్వెత్తున ఎగసిపదినట్లుగా
జలదరింపు.

నువ్వు ఏచలనం లేకుండా
మౌనం వహిస్తే
ఒక్కసారిగా శిశిర ఝంఝ
సమూలంగా నన్ను మొద్దుబార్చినట్టు
కలవరింత.

అందుకేప్రభూ ప్రతిరోజూ
నువ్వు నా కట్టెదుట నిలబడితే
నాలో పునర్యవ్వ నానికి
సుహృద్భావంతో స్వాగతంపలికినట్టు
పలవరింత.
ఆ సమాలోచనమొక్కటే
అంతరాంతరాళాల్లో
అమృతఝరి అనుస్యూతంగా
ప్రవహించినట్టు పులకరింత.
========================

Friday, October 9, 2015

అగమ్య గోచరం
---------------రావెల
**************************
నీకు హృదయమునదని తెలుసు
అది వజ్రకాఠిన్యతుల్యమని
ఎందరికి వాస్తవంగా తెలుసు?

నీకు మనసుందని తెలుసు
అది మధుకీలలను
రగిలించగలదని ఎవ్వరికి తెలుసు?

నీకు ప్రేమించడం కూడా తెలుసు
ఆప్రేమ ప్రవాహంలో పొంగిపొరలేదంతా
ఉప్పునీరేననని ఎందరికి తెలుసు?
============================
నేను నీదగ్గర సెలవుతీసుకోవడానికి
నిన్ను సమీపించిన సమయాన
నమ్మశక్యంగాని నవ్వొకటి
నీకళ్ళలో చటుక్కున
మెరవడం గమనించాను.

ఇలాసార్లు చెప్పి నిన్ను నమ్మించాలని
విఫలప్రయత్నం చేసాననేగా,  నీ పరిహాసం.
నిజం నీకు చెప్పలంటే నా మనసులో
ఓ సండేహం తొణికిసలాడుతూ వుండేది.


వసంతం పున: పున: ఏతెంచడం మనమెరుగుదుము.

పూర్ణచంద్రుడుకూడా పక్షం రోజులతర్వాత
మళ్ళీ పునరామనంకూడా
 మనకు కొత్తేమీకాదుగదా!!

శిశిరంలో వాడుముఖంవేసిన పూలమొక్కలు
మళ్ళీ ద్విగుణీకృతోత్సాహంతొ వికసించడం
మనకు పరిచయంగాని విషయమేమీకాదు గూడా!!


అలాగే నా నిష్క్రమణం
పునరాగమనానికే ననిగదా
నీ సంశయాత్మపడే సందేహం.

ఆ భ్తమను కొంచెం సేపు అలా ప్రక్కనపెట్టు.
విసురుగానో విసుగ్గానో దాన్ని విదిలించుకోకు.
వదిలించుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకో!

నేను ఆఖరుసారిగా వెళుతున్నానని
చెబితే అది నిజమని నమ్ము.
ఒక్క క్షణం పాటు నీ కనుకొలకుల్లో
నీటిని సుడులుగా తిరగనీ!!
మళ్ళేఎ నేను తిరిగంటూ రావడం జరిగితే
ఓ క్రీగంటిచూపుతో నన్ను తిలకించు, సెలవామరి!!
---------------------------------------------
[టాగూరు తోటమాలిలోని 40 వకవితకు నా తెలుగుసేత]
మధ్య తరగతిజీవనంలో
మందహాసం కోసం
రాత్రింబవళ్ళూ
వెదికి వెదికి
 విసిగి వేసారిపోయాను.


నింగినంటిన ధరల
కొక్కేనికి వ్రేలాడుతూ
ఇవ్వాళ్టి ప్రభాత సమయాన
దర్శనమిచ్చింది.

ఆశ్చర్యం చెందడం
నా వంతయిమిగిలితే.
అపహాస్యం చేయడం
తనవంతై నిలిచింది.

====================

Thursday, October 8, 2015

చెవిలో చైతన్యధార
------------------------రావెల
====================

చీకటి చిక్కబడుతున్నకొద్దీ
చిట్టి కొవ్వొత్తికి శ్వాసబిగదీసింది.
తిమిరంతో సమరమెలాజరుపాలో
అర్ధంగాక నిస్పృహకులోనయింది.

రాత్రి వడివడిగా
 విస్తరించడం మొదలెట్టింది.
నేనేమో అడుగంటూలేని
అగాధపుటంచుల్లొకి
జారిపోయినట్టుగా  చప్పుడయింది.

గాలి ఈలవేసిన చప్పుడు
అనూహ్యంగా నాకు
 అత్మీయతాశిబిరంలోకి
 రమ్మని ఆహ్వానం
మాకౌగిలోకి వచ్చి
స్వేచ్ఛగా సేదతీరమని
తరుసమూహం పలుకరింపు.

గాఢ నిద్రలోకి గబగబా
దూరిపోతున్న నాకు
జబ్బపట్టుకుని లాగుతున్న
అనుభవం ఎదురయింది.
రేపటి ఉదయం కలలోకనబడి
మనిషీ నీ భవిష్యత్తు
మహోజ్వలంగా ఉంటుందని
శుభవార్తను చెవులో చెప్పేసి
చిరునవ్వుతో నిష్క్రమించింది.
========================6-10-15

Wednesday, October 7, 2015

రేపటి సర్వసంగ పరిత్యాగికి
అర్ధరాత్రిపూట తన నిర్ణయాన్ని
ప్రకటించాలన్న కోరిక కలిగింది.
నేనింక సన్యాసాశ్రమంస్వీకరించే
సమయం ఆసన్నమైంది.
ఇంతకాలం ఈ సంసారం ఉచ్చులో పడి
సం యమనాన్ని కోల్పోయాను.ఈ ఉచ్చులో
ఎవరో నన్ను కట్టిపడేసి బందీనిచేసి
మోసం చేసారు,భ్రమలను కల్పించి వంచించారు!



భగవంతుడు సన్నటిస్వరంతో చెప్పాడు.
ఆ వ్యక్తినినేనే సుమా!! అతని చెవులు ఆ
సంభాషణను వినిపించుకోవడం మానేసాయి.


దగ్గరగా పట్టెమంచం మీద
 ఆదమరిచి నిదురిస్తున్న తల్లి
స్తన్యాన్ని గ్రోలుటూ ఆనందాన్నభవిస్తున్న
చంటిపాపాయి-- విప్పారిన సుమంలా ప్రశాంతంగా!!



కొంతసేపటికి మళ్ళీ అతడినుంచి ఓ ప్రశ్న.
ఎవరు నీవు ఇంతకాలం నన్ను
మాయలోపడేసి మోసం చేసావు?
నేను భగవంతుడిని అని ప్రత్యుత్తరం
అతనికిదికూడా వినబడినట్లుగాలేదు.
మౌనమే ఇరువురిమధ్యా
శూన్యాన్ని నిలబెట్టిపోయింది.
పాప కలలో కలవళపడినట్లుంది.
పెద్దగా ఏడుపు లంకించుకుంది.
తల్లికి మరింతాగ్గరగాచేరి
 చీరె కొంగుపట్టుకుని ధైర్యంగా
నిద్రలోకి జారుకుంది.
భగవంతుడు అధికారస్వరం తో అరిచాడు.

మూర్ఖుడా !!ఈగృహాన్ని వదలి ఎక్కడికి పారిపోకు
ఏ ఆశ్రమాన్నీ ఆశ్రయించకు.అతనికేమీ
 వినబడిన దాఖలా కనబడలేదు.


ఏమిటీ ఇంత  తెలివితక్కువవాడా  నా భక్తుడు.

ఎదురుగా నేనుండగనే నాఉనికికోసం వెదుకుతున్నాడు.
ఆమాతృమూర్తి సుఖనిద్రలో నేనే  ఆ చిట్టి పాలబుగ్గల
 పాపాయి నవ్వులోనేను కనబడలేదా మందమతికి
అని చిరుమందహాసాన్ని ప్రకటిస్తూ
పరమ భక్తుడైన  మందమతినిచూసి మూర్ధన్యుడయినాడు.
[టాగూరు తోటమాలిలోని కవితకు నా తెలుగుసేతకొద్దిమార్పుతో]
===========================================

Tuesday, October 6, 2015

ఇది ఆగనిపోరాటం
తిమిరతతులతో జరిగే
నిరంతర సమరం.

తోడూ నీడలా నిలవాల్సిన
తరువే చెంపలను తన ఆకులతో
మెల్ల మెల్లగారాసుకున్నట్లు
మృగాళ్ళ వికృతచేష్టలకు
వణుకుతూన్న ఆడతనం
అనాదిగా ఎదుర్కొంటున్న
అవమాన భారం ఇది.

భుజాలను క్రిందకు తోసేసినా
ఎడతెగని ధైర్యంతో
ఎగ శ్వాస దిగశ్వాసల మధ్యన
ఎత్తి కుదేస్తున్న సమాజపు స్థితిగతులను
మూగగా మూల్యాంకనంచేసుకునే ముద్దబంతిపూలు.
============================
ఒక ప్రభాత సమయాన
-------------------------రావెల
=====================================

పట్టణపు ప్రక్కటెముకలను
విధిగా విరగ్గొట్టుకుంటూ
ప్రభాతపు సూర్యకాంతి
ఆవులిస్తూ నిద్రలేచింది.

తనకాళ్ళను బార్లా
ఆరజాపుతూ చుట్టూరా వెలసిన
పల్లెలదాకా గబగబా
భానూదయాన్ని విస్తరింపజేసింది.

పట్టణానికి హఠాత్తుగా
మెలకువ వచ్చింది.
చీకటిదుప్పటిని అన్ని ద్వారాలగుండా
బయటకు విసిరేసి ఊపిరి పీల్చుకుంది.

సూర్యభగవానుడు కేకలతో కేరింతలతో
సిమ్హద్వారమేగాక
అన్ని గవాక్షాలలోనుండికూడా
ఉషోదయపు కాంతులతో రంగప్రవే శం  చేసాడు.

పక్షి గణమంతా ఒక్కసారి ఉలిక్కిపడిలేచి
అయ్యవారికేకలకు జోగుతున్న స్థితినుంచి
ఉలిక్కిపడిలేచిన భజంత్రీల్లా
తమ స్వరాభిషేకానికి గళాలను
సవ్యంగా సవరించుకోవడం మొదలెట్టాయి.

ఆ గానామృతం కోడి కూతలకన్నా వేగంగా
చుట్టూ విస్తరించిన పల్లెలకూ వ్యాపించి

పులకిత వదనులను గావించడం ప్రారంభమయింది.     6-10-15

[ఒక ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో ]
====================================

Monday, October 5, 2015

శ్రమించే స్వేదం నీది
పరిభ్రమించే నైజం నాది
ఇరువురిమధ్యా
తచ్చట్లాడే  తత్వం ప్రేమది.
ముచ్చట్లాడే వయసునీది
ముచ్చటపడే మనసు నాది
మురిపెంతో ముద్దాడే మోజు నీది
కాదనగల కన్యాత్వం నాది.
ఇరువురిమధ్యా సణుగుతూ
సాగే జీవితం ఈ కలికాలానిది.
=========================
కన్నీటితో నీకు వీడ్కోలు చెప్పక తప్పడంలేదు!
గ్రీష్మమత టా  పరుచుకుపోయి విస్తరించిన
తృణసంపదంతా క్రమేపీ రూపు రేఖలనుకోల్పోతూ
హిమశకలాలతో ముఖమంతా కప్పుకుని
హృదయ విదారకమై వేదనను కలిగిస్తున్నది.
ప్రకృతిమాతా తన మంచు దుప్పటిని
 ధరణీతలమంతటా కప్పిపడేయాలన్న
ఉత్సుకతతో ముదుకడుగులు వేస్తున్నది.

నేను నడువవలసిన దారంతా   రాలిపడినాకులతో
అస్తవ్యస్తంగా తయారయికనుమరుగై పోతున్నది.
నన్నుఇద  oతా అయోమయానికి గురిచేస్తున్నది.
ఇంకేం చేయాలో అస్సలేం బోధపడడంలేదు.
అంతరాతరాళాల్లో పరుచుకుపోతున్న నిశ్శబ్దం
ఏకాoతాన్ని తోడు రమ్మని పదే పదే
విజ్ఞాపనలనందిస్తున్నది.

ఎవరితో సంభాషించాలన్నా మాట పెగలడo లేదు.
 ఎదురుగా కనుపిస్తున్నదంతా
నిర్మానుష్యమౌతున్న వనసమూహం.
ఏ ఒక్కపిట్టా తన గళాలను సవరిస్తున్న
 సంద డేం   స్ఫురించడంలేదు.
ఏఒక్కపువ్వూ తనపరిమళాను ప్రసరింపజేయాలని
కుతూహలపడుతున్నసందర్భమూ  కనరావడంలేదు.

ఆకాశమంతా దట్టమైననల్లని మబ్బులతో
చిక్కని చీకటిని నేలకు పంపి నిమ్మకు నీరెత్తినట్లు
 నిస్త్రాణతో నిలుచుండిపోయినట్లనిపిస్తుంది.
ఇంత  నిరామయ ధోరణితో సర్వ ప్రాణికోటీ
     శ్వాసించడం  సాధ్యంకాదుగదా!
 శాసిస్తున్నరుతువులను గట్టిగా నిలదీయాలన్న తపన.
ఎటువైపు దృష్టిసారించినా మౌనముద్రను దాల్చిన ప్రకృతి.
ఇలా స్థాణువై జడపదార్ధంలా స్థిరీకరించబడడం
ఎవరికయినా మనో వ్యధను కలిగించడం సహజమే గదా!
కాదనలేం!!
ఈ ప్రవాసo   ఇంకెన్నాళ్ళని దీనంగా ప్రశ్నిస్తున్న మనసును
రుతువు మారేదాకా ఈ శైధిల్యం తప్పదని
 సమాధానం చెప్పాలని
మనసు ఉవ్విళ్ళూరుతున్నది.
==================================
చేతినిండా పనిలో నిమగ్నమై వున్నావా? నవవధూ!!
ఒక్క మాటనాలకించు. నీ ముఖద్వారంచెంత
అతిధి  వచ్చి వేచివున్నాడు సుమా!
అతను తలుపుకు తగిలించిన గొలుసును  అదేపనిగా కదిలిస్తూ వున్నాడు.
నీ చేతిగాజులు శబ్దంచేయకుండా చూసుకో! నీ పాదయుగం
 కంగారుపడుతున్నట్లుగా అర్ధం వచ్చేలా అడుగులువేస్తూ  నడువకు.!

అతను సాయంత్రమనగా వచ్చి ముఖద్వారం చెంట ఆశగా వేచియున్నాడు.
అది విసురుగావీచే గాలిదుమారంకాదులే,  కంగారుపడకు.
ఇది వసంతకాలపు పున్నమి రాత్రినాటి  వెన్నెల సుమా!!
నీ గృహ ప్రాగణంలో పడుతున్న నీడలు
నెత్తిమీద నిoగేమో ప్రకాశవంతంగా వెలుగును విప్పారుస్తున్నది.


నీ ముఖాన్ని అవసరమనుకుంటే ముసుగుతో కప్పుకో
అంతగా భయమనిపిస్తే ద్వారందాకా , దీపం తీసుకెళ్ళు!!
ఒక వేళ నీకు సిగ్గనిపిస్తే తలుపు చాటున నిలబడు చాలు!
అతనితో ఒక్క మాటా మాటాడవలసిన పనిలేదు గుర్తుంచుకో!!

అతనేమన్నా ప్రశ్నలునిన్నడుగుతుంటే నీ దృక్కులను
 నెమ్మదిగా  నేలబారుకు మౌనంగా  మరలించు!
నీచేతిగాజులు సవ్వడిచేయకుండా మాత్రం జాగ్రత్త వహించు!
చేతిలో దీపధారివై వుంటావు సుమా!! కంగారు యేమాత్రం పడకు!!
నీకు సిగ్గనిపిస్తే అతనితో సంభాషించవలసిన అవసరం లేదు గమనించుకో!!

ఇంకా నీ ఇంటిపనిలోనే నిమగ్నమై వున్నావా?
నవవధూ !విను అతిధి  ఇంటిముందు తలుపుచెంత వేంచేసి ఉన్నాడు!!

ఇంకా పశువులపాకలోకూడా దీపం వెలిగించలేదా కంగారు పడకు!!
మరింకా సాయంకాలపు సేవకు కూడా   పూలతో సిద్ధంకాలేదా?
ఇంకా పాపిటన  కుంకుమబొట్టును ధరించలేదా?
రాత్రి కాలకృత్యాలు ఇంకా పూర్తికాలేదా? చేతిలో పనులింకా సమాప్తం కాలేదా?
ఓ వధూ, వినిపించుకో, కంగారేంలేదు అతిధి వచ్చాడన్న
సమాచారమే  నీకందించాలనే  నేను త్వరపడుతు  చెబుతున్నది!!!

[టాగూరు తోటమాలిలోని 10 వ కవితకు నాతెలుగు సేత]
********************************************************************************


Sunday, October 4, 2015

అతను నాకుదగ్గరగాజరిగి
సణగడం మొదలెట్టాడు చిరాకుగా
ఒక్కసారి నీ కనులెత్తిచూడవా?
అని ప్రాధేయపదుతున్న గొంతుకతో.
రెండుచేతులెత్తి ప్రార్ధనాపూర్వకంగా
మందలిస్తూ చెప్పాను, "బాబూ నన్ను వదిలెయ్" అని.
అతను తనముఖాన్ని నాకు దగ్గరగా చొప్పిస్తూ
దీక్షగా నావైపు దృక్కులు సారించడం మొదలెట్టాడు.
"సిగ్గులేదానీకు," అని బిగ్గరగా అరిచాను కొంచం స్వరం పెంచి.
అతనిలో ఎలాంటి చలనమూ కలిగినట్లులేదు.
అతను అనూహ్యంగా తన పెదాలతో నాచుబుకాన్ని స్పృశించాడు.
నేను వణుకుపుట్టి గట్టిగా అరవడం మొదలెట్టాను.
కానీ అతను సిగ్గుపడినట్లు దాఖలా యేమీ కనబడలేదు.
అతను హడావిడిగా నాజడలో ఓ గులాబీని తురిమాడు.

"అది నిష్ప్రయోజనమైన పని" ఎందుకు అలా చేసావ్? అని గద్దించాను.

నాగళసీమనలంకరించిన పుష్పమాలను హటాత్తుగా పెరికేసి
చటుక్కున విసురుగా వెళ్ళిపోయాడు ,కోపారుణ నేత్రాలతో.
నాహృదయం వేదనాతప్తయైపోయింది ఒకేఒక్కక్షణంలో.
"అతనుమరలా తిరిగి రాడెందుకని?" అని మూగగా
నామనసు నన్నుదోషిగా బోనులో  నిలబెట్టింది ఉత్త పుణ్యానికే
మూగరోదన నాఏకాంతానికి తోడుగా నిలిచింది నిశ్శబ్దాన్ని హత్తుకుంటూ

--------------------------------------------------------

[టాగూర్ తోటమాలి సంపుటిలోని  36 వ గీతానికి నా తెలుగుసేత.]
నన్ను మనసారా మిత్రులారా,  మన్నించండి
ఇలా మీరుచెప్పారుగదాని నేను
 ఎలాంటి ఋషితుల్యుడిగానో ,
 పరిత్యాగిగానో    కాలేను.
ఆమెకూడా నాతోపాటే ప్రమాణ
స్వీకారంచేసేదాకా నా నిర్ణయంలో
ససేమిరా, ఎలాంటి మార్పంటూ వుండబోదు.

ఇవ్వాళనేనొక శుభగడియలో
 ఓ గట్టి  నిర్ణయం తీసుకున్నాను.
నాకు ఆరుగాలాల లోనూ
తగునీడనొసంగే తరుచ్ఛాయ లభించేదాకా
నాతోపాటు ఈ తపస్సులో పాలుపంచుకునే
మరో విశిష్టమైన విశ్వాసపాత్రమైన
వ్యక్తి  నాకుతోడుగా  లభించేదాకా
నేనుఎలాంటి ఋషితుల్యుడినో ,
 పరిత్యాగినో కాలేను.

ఇంత ఆనందదాయకమైన
గృహసీమను వదులుకుని
ఏకాంతంగా ఒక్కడినే
వననివాసిగా శ్వాసించలేను.
ఆచెట్టునీడలో ప్రతిధ్వనించే
పక్షులకిలకిలారవాలు
నన్ను పులకింపజేసేదాకా
 ఓ ఆకాశదీపం అఖండంగానూ
దేదీప్యమానంగానూ
వెలుగుతూ గాలితో
సయ్యాట   లాడే సమయందాకా
మౌనముద్ర మృదువైన సంభాషణా
స్వరాలను లోతుగా   శ్రవణపేయంగా
నేను ,నాకర్ణపుటాలు వినేదాకా  క్షమించండి మిత్రులారా!!
ఎలాంటి ఋషితుల్యుడినో, పరిత్యాగినో కాలేను.
----------------------------------------
[టాగూరు తోటమాలిలోని 43 వకవితకు తెలుగుసేత]
--------------------------------
త్వదీయం
------------
ఆమె
 ఓ వెలుగుకిరణం
వెల్లువగా పారుతూ వచ్చే
  తిమిరసంద్రాలను, పొర్లి
తిన్నగా నాగదిలోకి ప్రవహించకుండా
దారిమళ్ళించేందుకు
నిరంతరo శ్రమకోరుస్తూ
నన్ను గట్టెకించేస్తుంది.

ఆమె
 ఆధునికతను సంతరించుకున్న
అద్భుత తైలవర్ణ చిత్రం
రంగులు దిద్దుకున్న రమణీయ సౌందర్యలలామయై
ఎంతగానో నాగుండెకు హత్తుకుపోయి
అందమైన అనుభూతిగా
అంతర్వాహినిలా, పరిణమించి
 అనవరతం నాలో ప్రవహించి
 నన్ను పరమానంద భరితుడిని
గావిస్తుంది.

ఆమె
ఓ పద్యకవిత
లయాన్విత సౌందర్య సృజనయై
చందోబద్ధంగా చిందులేస్తుంటుంది .
మాటలకందని మౌన భావాలను సైతం
రాగరంజితంజేస్తూ
రసరమ్య డోలికల్లో వూగేలా చేస్తుంది
విస్మృత చరణ స్ఫురణగా ద్యోతమై
వీనులకువిందుగావిస్తుంది.
------------------------------------------

Saturday, October 3, 2015

నిన్నటిదాకా మాఇంటి ముందు చెట్టుమీద
పచ్చని చిలుకలొచ్చి వాలిపహారాకాసేవి.
చెట్టువేపదయినా వీచేగాలి హాయిగా
చెమట బట్టిన తనువులకు చందనంలా తగిలేది
ఎండా కాలం వచ్చిందంటే మాడాబామీద
పదిమందిపైగా వచ్చి పడుకుని కోడికూతకు
మెలుకువరాగా ఇళ్ళాకు పనులందుకోవడానికి
పరుగులు తీసే వారు. ఉన్న ఒక్క బావినీరున్
అందరూ తఓదుకునేవారు.చెరువులో నీరున్నంతకాలం
బావినీరు తియ్య తియ్యగా నోటికి  అరుపుకొచ్చి ఉండేవి.

కులాలమతాలకతీతంగాఅం దరు  పరస్పరం పండుగలు
జరుపుకుంటూ ఐకమత్యంతోమెలగేవారు;
=====================================




ఒక్క సరళ రేఖనుకూడా సరిగ్గా గీయలేనివాడు
బాపుగానో, రవివర్మగానో పికాసోలాగానో
తయారు కావాలని తపించడంలో తప్పులేదు!
శ్రమించడం అటకెక్కించినప్పుడే
అభాసుపాలవడం ఆరంభమౌతుంది.

ఒక్క పదాన్నికూడా కుదురుగా  సమన్వయంతో
 క్రోడీకరించే నేర్పులేని వాడు
పోతన గారితోనో ప్రసాదరాయకులపతిగారిలానో
భవకవితా జలధి  దేవులపల్లి వారితోనో
సరిసమానంగా సాహితీ వ్యవసాయం చేయగలనని
తలపోయడం భ్రమ కాకుండా ఏమై వుంటుందంటారు?


కడిమళ్ళ వారిచెంతకు
వడి వడిగా చేరవలయు వేగమెరావే
సుడిగాలిపోలు ప్రతిభకు
ముడివేయగపదములెన్న మూర్తిని కానే
వాస్తవానికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టా కాదా?అని
ఒక నాణేన్ని చేతబట్టుకొచ్చి ఎగరేస్తా ఏగరేస్తానంటూ
వసపిట్టలా వాగుతూ రెచ్చిపోతున్నావేమిటి?
బొమ్మా బొరుసా చెప్పమంటూ,
తలా తోకల్లేని[ head or tail!!]   ప్రశ్నలతో
వేధిస్తున్నా వెందుకని?
తీరా నువ్ నాణేన్ని పైకెగరేస్తే
దేవుడన్న వాడున్నాడనిఋజువుకోసం
అది గోడుగా పడి నేలపై నిలిస్తే
ఏంచెప్పాలోతేలీక గోడు గోడునా విలపించి
ఇప్పుడు సాధించిన విజయమేమిటి?
 సమాధానం దొరకక చతికిల బడిపోతున్నావా!! ప్రియతమా?
---------------------------------------------------------------

Friday, October 2, 2015

మనసు మూగదాయెనురా
మాధవా! మధుసూదనా!!
కొనగోటిన త్రుంచబడిన సుమమువోలె
స్రుక్కి సోలి
తుదిఘడియలతీరెరుగక
తొందరపడి పోయితినేమొతెలియదు
 ఆమెకదియె అవసానదశయగునని
ఇపుడు వగచి యేమి ఫలము?

తోటలోని పూలడిగితె ఏమిచెప్పగలనునేడు?
ఆమె ఇక పోషణకై మీ చెంతకు
రాదురాదు  రాదటంచు
పూలతీగలన్ని నేడు వాడిపోవు దశకు జేరె
శక్తిమేర ఆమె కొర్కె నెరవేర్చెద నేను కూడ
కుండీలలొ నీరు నింపి ఎందుటాకులను యేరివేసి
నాచిన్నితోటనయిన ఆమె కొరకు పోషింతును
వాటి స్మితవదనమందు ఆమెరూపు చూసుకొందు
ఇప్పటికిదియే నావినతి ఆలకించుమయ్య స్వామి
మూగవోయిన మనసుకింత ఓదార్పునందివ్వుము
గతకాలపు స్మృతులనన్ని గుర్తుంచుము నాఎదలో
మనసు మూగదాయెనురా మాధవా !మధుసూదనా!!
*******************************************