Tuesday, October 13, 2015

నాకు నా బాల్యంలోని కొన్ని సంఘటనలు
ఇంకా నాకు గుర్తుకొచ్చి బాధిస్తూనే వుంటాయ్.

అది నడి ఎండాకాలం దాటి కొద్దికొద్దిగా
వానాకాలం వైపు అడుగులు పడుతున్న సందర్భం.

నాకు ఆనందాన్నందించే వానచినుకులు
 నన్ను బాగా తడిపి ముద్దను చేసిన సమయం.
నాకాగితంపడవనాకళ్ళెదుటనే
గుంటలోకి జారిపోయి మునిగిపోయింది.


అకస్మాత్తుగా ఆకాశమంతా చిక్కటి
చీకటితోగూడినట్టుగా మేఘావృతమై
బలంగావీచే గాలులతోడై
భీభత్సం సృష్టించింది.



వరద వెల్లువలా వాననీరు
వడివడిగా ఉరుకులతో పరుగులు  తీసిపారింది.
బురధ నీటితో నిండిన ఏరు
నాకాగితంపడవను క్రూరంగా ముంచేసింది.


ఆ తుఫాను భీభత్సం నన్ను నాతృప్తినీ
చూసి ఓర్వలేక ఈ అఘాయిత్యానికి
తలపడివుంటుందని నా ప్రగాఢ విశ్వాసం.

చిన్నప్పుడు ఆడే ఆటలన్నీ ఈ వేసవిలోనే
 ఆడేయాలన్న తపనకు ఈ వాతావరణానుకూలత
 నన్ను పూర్తిగా భంగపాటుకు గురిచేసి
కిమ్మిన్నాస్తిగా మారి  గమ్మున కూర్చుండిపోయింది.

నేను ఆటలన్నింటిలో విజేతను కాకపోయినా
నా బాల్యాన్ని నేను అనుభవించలేకపోయానన్న
అసంతృప్తి నన్ను నిరాశా నిస్పృహలకు లోను చేసింది.



విధి నాతో ఆడుకున్న వింతనాటకాలలో  ఇది భాగమని
మునిగిపోయిన నా కాగితం పడవనాకు
 పదే పదే గుర్తు చేసి మరీ బాధిస్తుంటుంది.

]టాగూరు తోటమాలిలోని 70 వ కవితకు నా తెలుగుసేత.]

Monday, October 12, 2015

ప్రియా!! రాత్రింబవళ్ళూ నీకోసమే
నాహృదయం తపనపడుతుంది.
మన ఈ కలయిక ఆకలిగొన్న
మృత్యువులా అగుపిస్తున్నది.

ఒక తుఫాను గాలిలా
నా సర్వస్వాన్నీ  ఊడ్చేసేయ్ .
నా దగ్గరున్న అన్నింటినీ
 నిర్భయంగా తస్కరించు.

నిద్రావస్థలోంచి
నన్ను తక్షణం   జా గృతంచెయ్.

ఈ ప్రపంచంలోంచి నన్ను
స్వేచ్ఛగా దొంగిలించేసెయ్.

ఈ విపత్కర స్థితిలో
 సౌం దర్యారాధనలో
మన ఇరువురం మమేకమవుదాం

అయినా నా అత్యాశగానీ
నీలో ఐక్యమవడం తప్ప
నా జీవనగమ్యం
ఇంకొకటి యేముంటుంది?


టాగూరు తోటమాలిలోని 50 వ కవితకు నా తెలుగు సేత]
==========================================

Sunday, October 11, 2015

అపరిమితమైన వేగంతో
 అతిధులంతా
పరుగు పరుగునా  నిష్క్రమించాలి
వెనువెంటనే వారు  వదిలివెళ్ళిన
 పాదముద్రలనన్నింటినీ
ఆనవాలు కూడా కనబడని  విధంగా
వడి వడిగా చెరిపేయాలి.

వారిని  హృదయానికి హత్తుకుని
సర్వ సాధారణమైనమందహాసo
 సామీప్యంలో తదనుగుణంగా
వారి కత్యంత  సన్నిహితంగా
 ప్రదర్శింపబడాలి.

ఇవ్వాళ ప్రేతాత్మల పండుగ
అవెప్పుడు మృత్యుముఖంలోకి
నేరుగా   వెళ్తాయో కూడా  అర్ధమవని
అసందిగ్ధమైన ఆక్రోశం.

నీ నవ్వు  అర్ధం  పర్ధంలేని భ్రమలో పడి
 చిరంతనంగా ,  వికసించనీ!!
తరంగాలపై తళుక్కుమనే కాంతిరేఖల్లా
తాత్కాలికంగానైనా దాన్ని  తారట్లాడనీ!


కాలం అంచులపైన ఆకులపై
ప్రకాశించే మంచుబిందువులా
  నీజీవితం ఆనంద నృత్యమాడనీ!!

నీవు అశాశ్వతమైన
పదాల పోహళింపుతో
క్షణకాలంపాటు
తీగలను సవరించుకో!!

[టాగూరు తోటమాలిలోని 45 వకవితకు తెలుగుసేత.]
======================================================
ఆ తీయని నీ పిలుపుకోసమే ప్రభూ!
నేను ఏకాక్షరంతో స్మరణ చేసేది.

నీ జవాబు కోసమే ప్రభూ!!
నేను ద్విత్వాక్షరాలతో
ప్రార్ధనలు గావించేది.

ఆ కరుణామృత వర్షంకోసమే
త్రిగుణాత్మకంగా విన్నవించేది.

ఆ సాక్షాత్కారంకోసమే ప్రభూ
చతురంబోధులతో నిన్నభిషిక్తుడిగా
పూజించి ప్రాధేయపడేది.

నిన్ను ప్రసన్నుడిని
చేసుకునేందుకే ప్రభూ
నీకు పవిత్రమైన
పంచామృతస్నానం చేయించి
మరీ పూజలో స్థాపించి
స్థిరపరిచేలాగా చూసేది.
---------------



=================================

Saturday, October 10, 2015

త్వదీయం
------------


నీ కరస్పర్శ తగలగానే
నరనరాల్లోనూ
ఉత్కంఠావహమైన ఉత్తేజం.


నువ్వు నన్ను గుండెకు
హత్తుకున్నంతనే ప్రత్యణువులోనూ
వాసంత సమీరం
ఉవ్వెత్తున ఎగసిపదినట్లుగా
జలదరింపు.

నువ్వు ఏచలనం లేకుండా
మౌనం వహిస్తే
ఒక్కసారిగా శిశిర ఝంఝ
సమూలంగా నన్ను మొద్దుబార్చినట్టు
కలవరింత.

అందుకేప్రభూ ప్రతిరోజూ
నువ్వు నా కట్టెదుట నిలబడితే
నాలో పునర్యవ్వ నానికి
సుహృద్భావంతో స్వాగతంపలికినట్టు
పలవరింత.
ఆ సమాలోచనమొక్కటే
అంతరాంతరాళాల్లో
అమృతఝరి అనుస్యూతంగా
ప్రవహించినట్టు పులకరింత.
========================

Friday, October 9, 2015

అగమ్య గోచరం
---------------రావెల
**************************
నీకు హృదయమునదని తెలుసు
అది వజ్రకాఠిన్యతుల్యమని
ఎందరికి వాస్తవంగా తెలుసు?

నీకు మనసుందని తెలుసు
అది మధుకీలలను
రగిలించగలదని ఎవ్వరికి తెలుసు?

నీకు ప్రేమించడం కూడా తెలుసు
ఆప్రేమ ప్రవాహంలో పొంగిపొరలేదంతా
ఉప్పునీరేననని ఎందరికి తెలుసు?
============================
నేను నీదగ్గర సెలవుతీసుకోవడానికి
నిన్ను సమీపించిన సమయాన
నమ్మశక్యంగాని నవ్వొకటి
నీకళ్ళలో చటుక్కున
మెరవడం గమనించాను.

ఇలాసార్లు చెప్పి నిన్ను నమ్మించాలని
విఫలప్రయత్నం చేసాననేగా,  నీ పరిహాసం.
నిజం నీకు చెప్పలంటే నా మనసులో
ఓ సండేహం తొణికిసలాడుతూ వుండేది.


వసంతం పున: పున: ఏతెంచడం మనమెరుగుదుము.

పూర్ణచంద్రుడుకూడా పక్షం రోజులతర్వాత
మళ్ళీ పునరామనంకూడా
 మనకు కొత్తేమీకాదుగదా!!

శిశిరంలో వాడుముఖంవేసిన పూలమొక్కలు
మళ్ళీ ద్విగుణీకృతోత్సాహంతొ వికసించడం
మనకు పరిచయంగాని విషయమేమీకాదు గూడా!!


అలాగే నా నిష్క్రమణం
పునరాగమనానికే ననిగదా
నీ సంశయాత్మపడే సందేహం.

ఆ భ్తమను కొంచెం సేపు అలా ప్రక్కనపెట్టు.
విసురుగానో విసుగ్గానో దాన్ని విదిలించుకోకు.
వదిలించుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకో!

నేను ఆఖరుసారిగా వెళుతున్నానని
చెబితే అది నిజమని నమ్ము.
ఒక్క క్షణం పాటు నీ కనుకొలకుల్లో
నీటిని సుడులుగా తిరగనీ!!
మళ్ళేఎ నేను తిరిగంటూ రావడం జరిగితే
ఓ క్రీగంటిచూపుతో నన్ను తిలకించు, సెలవామరి!!
---------------------------------------------
[టాగూరు తోటమాలిలోని 40 వకవితకు నా తెలుగుసేత]